35.2 C
Hyderabad
Wednesday, April 17, 2024
హోమ్తెలంగాణబిజెపిని ఓడించండి.!

బిజెపిని ఓడించండి.!

బిజెపిని ఓడించండి.!

రైతు, కార్మిక సంఘాల నేతల పిలుపు

విజయవాడ మార్చ్ 14 యదార్థవాది ప్రతినిధి: 

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న మహా పంచాయితీని జయప్రదం చేయాలని, వారికి సంఘీభావంగా విజయవాడ లెనిన్ సెంటర్లో గురువారం కార్మిక, కర్షక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బిజెపిని ఓడించాలని తద్వారానే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు  పురోభివృద్ధి చెందుతాయని, లేదంటే వినాశనమేనని  కార్మిక, కర్షక సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల గుర్తింపు, మిగ్ జామ్ తుఫాను వల్ల రైతాంగానికి జరిగిన నష్టం – ఉపశమన చర్యలు, రైతాంగ పంటలకు కనీస మద్దతు ధరలు, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి చేసిన నిధులు కోతపై, అటవీ సంరక్షణ నియమాల సవరణల చట్టం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం, కౌలుదారులు, వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ వ్యవసాయ సాగు ఉత్పత్తులకు,  తదితర పంటలకు తగిన మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల అన్ని రుణాలను మాఫీ చేయాలని, రాష్ట్రంలో కరువు పీడిత మండలాలను గుర్తించి తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. మిగ్జామ్ తుఫాన్ వల్ల తీవ్రంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బి.సి తదితర పేదవర్గాల రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ఎం.ఎస్. స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర సి+50% నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలన్నారు. కేంద్ర విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు బిగించే ప్రతిపాదన విరమించాలన్నారు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట నష్ట పరిహారం చెల్లించాలని, ఉపాధి హామీ పథకానికి నిధులను పెంచాలని కోరారు. రోజు కూలి రూ.600 ఇవ్వాలని, రెండు పూటలా పని విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం చేసిన అటవీ సంరక్షణ నియమాల సవరణల చట్టం – 2022ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అడివి హక్కుల చట్టం – 2006 ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఆదివాసీలు సాగు చేస్తున్న భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, టూరిజం పేరుతో అటవీ భూములను బడా కంపెనీలకు కట్టబట్టే విధానాలను విరమించాలని, ఆదివాసీలు సేకరించే అన్ని అటవీ ఉత్పత్తులకు గత సంవత్సరం కంటే 60 శాతం పెంచి ధరలు నిర్ణయించాలన్నారు. రాష్ట్రంలో సెజ్ లు, కారిడార్లకు ప్రభుత్వం కేటాయించిన భూములన్ని స్వాధీనం చేసుకొని తిరిగి రైతాంగానికి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని అసలు లబ్ధిదారులకు అప్పగించి వారికి జిరాయితి హక్కులు కల్పించాలన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ 3 ఎకరాలు చొప్పున సాగు భూమి, 3  సెంట్లు చోప్పున ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలన్నారు.  ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేటాయించాలని కోరారు. కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జి కాకుండా సిద్దేశ్వరం – అలుగు నీటి ప్రాజెక్ట్ ను నిర్మించి రాయలసీమకు తాగునీరు సాగునీరు అందించాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు, షరతులు, విధానాలను వ్యతిరేకించాలని, తక్షణం భారత దేశం డబ్యూటీవో నుండి వైదొలగాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, సుబ్బరావమ్మ, ఏఐటియుసి నాయకులు రవీంద్రనాథ్, జి ఓబులేసు, ఇఫ్టు నాయకులు పోలారి, రవిచంద్ర, రైతు సంఘాల రాష్ట్ర నాయకులు వై.కేశవరావు, జి.ఈశ్వర్, కెవివి ప్రసాద్ రావు, వీరబాబు, భార్గవ్ శ్రీ, మరీదు ప్రసాద్ బాబు, గణేష్ కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా రైతు సంఘం నాయకులు ఆంజనేయులు, యలమందరావు సభకు అధ్యక్షత వహించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్