యదార్థవాది ప్రతినిధి నాందేడ్
దేశ పరిస్థితులను చూసిన తర్వాత తెరాసను భారాసగా మార్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.. పార్టీని దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో నాందేడ్ లోని సచ్‌ఖండ్ బోడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహారాష్ట్రలోని పలువురు నాయకులకు భారాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్, పూలే వంటి మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మహారాష్ట్ర అని అన్నారు.”దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ, ఆ మేరకు మార్పులు రాలేదు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీసం తాగునీరు, విద్యుత్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే ‘అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో భారాస వచ్చింది. భారత్ బుద్ధి జీవుల దేశం.. ఎన్నాళ్లో ఎదురు చూశాం. ఇప్పుడు సమయం వచ్చింది. నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి.” అని కేసీఆర్ అన్నారు..అధికారమిస్తే.. 24 గంటల విద్యుత్‌దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్ ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. భారాసకు అధికారం ఇస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చిన మార్పు..దేశమంతా రావాల్సిన అవసరముందన్నారు. వచ్చే పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు భారాసను గెలిపించాలని కేసీఆర్ కోరారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, కిసాన్ సర్కార్ రావాలన్నారు. భారాస అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.