అనాధ పిల్లలు దైవంతో సమానం
యదార్థవాది ప్రతినిది గోదావరిఖని
ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న.. అని అన్నాడో మహాకవి… సమాజంలో విధి వంచితులై.. అమ్మ నాన్నలను కోల్పోయిన అనాధ పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టడం ఆధ్యాత్మికత సేవతో సమానమని సామాజికవేత్త దేవీ లక్ష్మీ నరసయ్య అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు మనోజ్ కుమార్ అగర్వాల్ – మనీషా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భం పురస్కరించుకొని.. సోమవారం రాత్రి గోదావరిఖని గాంధీనగర్ లో గల MDHWS అనాధ పిల్లల సంరక్షణ కేంద్రంలో పిల్లలకు ఆయన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ మనోజ్ కుమార్ పెళ్లిరోజు సందర్భంగా.. అనాధ పిల్లలకు అన్నదానం చేయడం చాలా సంతృప్తి ఇచ్చిందని,. ప్రతి ఒక్కరు తమ డైనందిక జీవితంలో ఏదో ఒక శుభకార్యం కు ఆడంబరంగా వృధా ఖర్చులు చేయడం కంటే.. విధి వంచితులైన ఇలాంటి అనాధ పిల్లలకు ఒక పూట అన్నం పెట్టడం బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. దివ్యాంగుడైన రాజయ్య తనకు వచ్చిన కష్టం మరి ఏ కుటుంబంలో రాకూడదని భావించి ఎంతోమంది అనాధలను చేరదీసి వారిని అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్న రాజయ్య నిజంగా గొప్పవాడని అన్నారు. ఈ ఆశ్రమం కు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా బాగుండి మనమే ఒక పూట సమయానికి భోజనం చేయకపోతే ఎంతగానో ఇబ్బంది పడుతుంటాం.. అలాంటిది ఈ అనాధ చిన్నారులు రోజుల తరబడి ఆకలితో ఎంతగా ఇబ్బంది పడతారో ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జయహో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు జక్కని శ్రీలత నేత తోపాటు ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు.