ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ముల మృతి
హుస్నాబాద్ యదార్థవాది
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతులు గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకల కృష్ణ, ఎరుకల సంజీవ్, ఎరుకల సురేష్, ఎరుకల వాసు లుగా గుర్తించారు. బ్రతుకుదేరువు కోసం వెళ్లి సూరత్ లో స్థిరపడ్డ నలుగురు అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలో తమ బాబాయ్ అంత్యక్రియలకు వచ్చి కారులో సూరత్ కు వెళ్తుండగా ఔరంగాబాద్ లో కారు పల్టీ కొట్టిన ఘటనలో నలుగురు అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. మృతుల స్వగ్రామం చౌటపల్లిలోని వారి గృహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను స్వగ్రామానికి తీసుకువ రానున్నట్లు బంధువులు తెలిపారు.