పుల్లూరు బండపై సంప్రదాయ బద్దంగా చక్ర స్నానం
ముగిసిన జాతర
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం పుల్లూరు బండ పై ఐదు రోజుల పాటు వైభవంగా జరిగిన జాతర చివరి రోజైన మంగళవారం దేవాలయ వంశపారంపర్య అర్చకులు సంప్రదాయ బద్దంగా నిర్వహించిన చక్ర స్నానం(చక్ర తీర్థం) కార్యక్రమంతో ముగిసింది.. చివరి రోజు సుదర్శన నారసింహ హోమం,పూర్ణాహుతి నిర్వహించారు..దేవాలయ కమిటీ చైర్మన్, వంశ పారంపర్య అర్చకులు కలకుంట్ల రంగాచార్య, పుల్లూరు గ్రామ సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్,కమిటీ డైరెక్టర్లు ఎక్స్ ఆఫీషియో సభ్యులు కలకుంట్ల వెంకట నరసింహా చారి, డైరెక్టర్లు కోడూరి శ్రీనివాస్, మొలుగు లక్ష్మీ మల్లేశం, కార్యక్రమాలను నిర్వహించారు.
దేవాలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల కృష్ణమాచారి, గోవర్ధనం నవీన్ కుమార్, కలకుంట్ల వీణా చారి, చిలకమర్రి నరసింహా చారి,చిలకమర్రి రమణా చారి,శేషం శ్రీవాస్తవ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. హోమం పూర్ణాహుతి అనంతరం సుదర్శన చక్ర పెరుమాళ్ ఉత్సవమూర్తిని,యాగ జలాన్ని తీసుకు వెళ్లి బండపై ఉన్న పవిత్ర పాలగుండం,లక్ష్మీ నరసింహస్వామి గుండాల్లో జలానికి శుద్ధి పూజలు నిర్వహించారు. అనంతరం హోమ జలాన్ని గుండం జలాల్లో కలిపిన అనంతరం సుదర్శన చక్ర పెరుమాళ్ ఉత్సవ మూర్తికి గుండం లో స్నానం చేయించారు. సంప్రదాయ బద్దంగా వేద మంత్రాలతో అర్చకులు కార్యక్రమాన్ని నిర్వహించారు.. అనంతరం చక్ర పెరుమాళ్ ఉత్సవ మూర్తిని తిరిగి దేవాలయం లోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కోవెల లో ఉంచారు.. దీంతో 5 రోజుల పాటు జరిగిన పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి స్వామి బండ జాతర ఘనంగా ముగిసింది..