ప్రాంతీయ ఆసుపత్రిలో డీఈఐసీ సేవలు.. 5 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్ మంజూరు
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..
యదార్థవాది ప్రతినిది వేములవాడ
వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి డీఈఐసీ, 5 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్ మంజూరు అయ్యాయని, త్వరలోనే ఈ సదుపాయాలను ప్రజలకు (రోగుల) సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు..మంగళవారం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో సందర్శించారు. డీఈఐసీ (డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్) ద్వారా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పిడియాట్రిక్ డాక్టర్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ కేంద్రంలో ఇద్దరు వైద్యులతో, పది మంది సిబ్బంది వైద్యసేవలు అందిస్తారని తెలిపారు. ప్రసూతి విభాగాన్ని సందర్శించి డెలివరీ, మహిళలతో మాట్లాడి వైద్య సేవల తీరుపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో టాయిలెట్ నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ అన్వేష్ ను ఆదేశించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి, జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మహేష్ రావు, తదితరులు పాల్గొన్నారు.