మీడియా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతుంది
-వాస్తవానికి దూరంగా న్యాయస్థానం స్పందన
-గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వల్లే జర్నలిస్టులకు అన్యాయం
-తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 30 ; నల్గొండ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో ప్రెస్ క్లబ్ కార్యక్రమాలను కొనసాగించడానికి నల్గొండ ప్రెస్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా జర్నలిస్టులు ఎదురు చూస్తన్న ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు దిగ్భ్రాంతి కలిగించింది.. ఐఏఎస్, ఐపిఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమానంగా జర్నలిస్టులను చూడడం నివ్వెరపరిచిందన్నారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై కమిటీ రిపోర్ట్ అందజేసిందని, హెల్త్ కార్డులపై భీమా కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు..
జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీపై సుప్రీం కోర్టు తీర్పు పై..
గత పదేళ్లుగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇళ్లస్థలాల సమస్యను కొలిక్కి తీసుకువస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ దేశంలో ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేల సరసన జర్నలిస్టులను చేరుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరినీ నివ్వెరపరిచింది. జర్నలిస్టులు ఏరకంగానే ఆ కోవలోకి వచ్చే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు అటువంటి వైఖరి తీసుకుంది అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఐపిఎస్, ఐఏఎస్ అలిండియా అధికారులకు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా ఒకే రీతిలో జీతబత్యాలు ఉంటాయి. అదే విధంగా పార్లమెంట్ సభ్యులకు దేశవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎన్నికైనా.. ఒకే రీతిలో వేతనాలు ఉంటాయి. అలాగే ఎమ్మెల్యేలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మేరకు అందరికీ ఒకే విధంగా వేతనాలు ఉంటాయి.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తులు అర్థం చేసుకోని అంశం ఒకటి ఉంది. ఈ దేశంలో జర్నలిస్టులు అందరికీ ఒకే విధంగా వేతనం అమలులో లేదు. జాతీయ స్థాయి పత్రికల్లో పనిచేసే వారికి, ప్రాంతీయ భాష పత్రికల్లో చేసే పాత్రికేయులకు, చిన్న, మద్య పత్రికల్లో పనిచేసే వారికి వేతన వ్యత్యాసం చాలా ఉంది. పాకిస్తాన్ కంటే ఆధ్వాన్నంగా భారతదేశంలో పాత్రికేయులకు వేతనాలు అమలు తీరు ఉంది. 15 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి అమలు జరపాలని ఇచ్చిన నోటిఫికేషన్.. కేవలం 22 శాతం జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్టులకు మాత్రమే అమలు కావడం సిగ్గుచేటైన విషయం. అమలు చేయాల్సిన ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. అమలును చూడాల్సిన అంశాలను న్యాయస్థానాలు చొరవ చూపడం లేదు. అటువంటి న్యాయస్థానాలు జర్నలిస్టులను అలిండియా అధికారులతో సమానంగా చూడడం బాధాకరం. వాస్తవదూరంగా ఈ తీర్పు ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం జవహార్ లాల్ హౌజింగ్ సొసైటీకో, తెలంగాణకో సంబంధించినది కాదు.. ఇది భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. జర్నలిస్టు మిత్రులు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. ఈ తీర్పును కచ్చితంగా వ్యతిరేకించాలి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదించాము. ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై అడ్వకేట్ జనరల్ తో చర్చలు జరుగుతున్నాయి. సుప్రీం తీర్పు వాస్తవాలను ప్రతిభింభించేది కాదు.. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ఇచ్చింది కాదని బావిస్తున్నాము. ఈ తీర్పు ఎంతవరకు వర్తిస్తుంది అనేదానిపైనా న్యాయనిపుణులతో చర్చిస్తున్నాము. 16, 17 ఏళ్ల తర్వాత ఒక చీఫ్ జస్టీస్ ఇచ్చిన తీర్పుపై మరో చీఫ్ జస్టీస్ తీర్పు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. సొసైటీపై తీర్పు వెలువడిన వెంటనే రెండు సంవత్సరాల క్రితమే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకే దీనిపై ప్రభుత్వం స్పందించింది. జర్నలిస్టులకు ఇళ్ల సమస్య మీద విశ్లేషించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది..
అక్రిడిటేషన్ కార్డుల జారీ పై..
“గత ప్రభుత్వంలో రూపొందించిన నియమ నిబంధనలు న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయని రెండు పర్యాయాలు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ నిబంధనలు రాజ్యాంగానికి, భావ స్వేచ్ఛకు వ్యతిరేకమని హైకోర్టు చెప్పింది. ఆ నిబంధనలు రామచంద్రమూర్తి కమిటీ ఇచ్చిన సిఫార్సులకు భిన్నంగా ఉన్నాయి. భాషా ప్రాతిపదికన అక్రిడిటేషన్ ల జారీలో తారతమ్యాలు చూపవద్దని, చిన్న పత్రికల పేరుతో తగ్గించడం భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం అని కోర్టు వెల్లడించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవరించడానికి, ఉన్న సమస్యలను అర్థం చేసుకొని తాజా నిబంధనలు రూపొందించడానికి నెలన్నర కిందట ప్రభుత్వం స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆరు సార్లు సమావేశమై ఒక నివేదికను ప్రభుత్వానికి (కమిషనర్ కు) అందజేసింది. ప్రభుత్వం దానిని ఆమోదిస్తే జనవరిలో కొత్త కార్డుల జారీకి చర్యలు ప్రారంభమవుతాయి.
జర్నలిస్టులకు హెల్త్ కార్డుల జారీపై..
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హాయాంలో జర్నలిస్టులు కొంత మేర భరిస్తే మూడు వంతులు ప్రభుత్వం భరించి హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వం ఉద్యోగులకు, జర్నలిస్టులకు కలిపి ఒకటే జీవో విడుదల చేసింది. దాని ప్రకారం 700 కోట్ల పైన బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ప్రయివేటు కార్పోరేట్ ఆసుపత్రులు జర్నలిస్టులకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి మీడియా అకాడమీ తరుపున ఒక ప్రతిపాదన చేశాము. గతంలో జర్నలిస్టుల నుంచి కొంత చెల్లించే విధానాన్ని తీసుకవస్తే బావుంటుందని పరిశీలిస్తున్నాము. 75 వేల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కంపెనీలతో సంప్రదిస్తున్నాము. ప్రిమీయం చెల్లించిన రోజు నుంచే అన్ని చికిత్సలు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నాము. గతంలో వివరాలు పరిశీలిస్తే.. దాదాపు 40 శాతం కంటే తక్కువ మంది వినియోగించుకున్నట్లు గుర్తించాం. మంత్రి గారితో సంప్రదించాము. తుదిదశలో చర్చలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మా తెలిపారు. ఇక జర్నలిస్టులపై దాడులపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందించిన శ్రీనివాస్ రెడ్డి రోజురోజుకు మీడియా పై దాడులు పెరుగుతున్నాయంటే జర్నలిస్టుల నడుమ నెలకొన్న అనైక్యతే కారణమని అభిప్రాయపడ్డారు. మీడియా యాజమాన్యాల పాలసీల పేరుతో జర్నలిస్టులు సైతం అన్యాయాలను ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారని తెలిపారు. చాలా విషయాల్లో ప్రజలకు వాస్తవాలను సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నాయని.. అయితే అక్కడ కూడా కొన్ని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నమాట వాస్తవమని అన్నారు. మీడియా అనేది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల పరిధిలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం జర్నలిస్టులకు సంక్షేమం అందించడం వరకే పరిమితం అని తెలిపారు. అనంతరం మొదటిసారి ప్రెస్ క్లబ్ కు విచ్చేసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని ప్రెస్ క్లబ్ కార్యవర్గం శాలువతో సత్కరించి, జ్నాపికను అందజేశారు.