వ్యవసాయ కార్మికులకు 12000 పథకాన్ని ప్రారంభించాలి
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 17: ఎన్నికల సందర్భంగా వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని ధర్మ బిక్షం భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం( బి కే ఎం యు అనుబంధం) జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశానికి హాజరైన మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా అట్టడుగున ఉన్న వ్యవసాయ కార్మికులకు సరైన సహకారం ప్రభుత్వ నుంచి అందాల్సిఉందని దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న వారు అనేకమంది వ్యవసాయ కార్మిక కుటుంబాలకు చెందిన వారేననిఅన్నారు. నేటికీ ఇండ్లు లేక సరైన వైద్యం లేక వారి పిల్లలకు సరైన విద్య అందక అవస్థలుపడుతున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో అసంఖ్యాకంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటిన వ్యవసాయ కార్మికులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ అందించాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 700 రూపాయల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందించాలని ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వ్యవసాయ కార్మికులకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని, ఇళ్ల స్థలము లేని వ్యవసాయ కార్మికులకు స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 12 వేల రూపాయలు రెండు దఫాలుగా కాకుండా ఒకే దఫాలో చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రేమిడాల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, గౌరవాధ్యక్షుడు ఎండి ఎక్బాల్, స్టాలిన్, జడ వెంకన్న పాల్గొన్నారు