సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం: జిల్లా అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ
మంథని యదార్థవాది ప్రతినిధి
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరుగుతున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అన్నారు. శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ మంథని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి మునిసిపల్ పరిధిలోని మూడవ వార్డు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ముందస్తుగా ప్రజా పాలన కార్యక్రమం ఉద్దేశించి వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం రెండు లక్షల 25 వేల 838 కుటుంబాలు ఉన్నాయని గ్రామ మునిసిపల్ వార్డులలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంమని, ప్రజా పాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రజలు దళారులను సంప్రదించకుండా ముందస్తుగానే ప్రజలకు దరఖాస్తులను అందజేస్తున్నామని దరఖాస్తులను ఇంటి వద్దనే నింపుకొని గ్రామ వార్డు సభలకు వచ్చి కౌంటర్లలో అందజేసి రసీదు పొందాలని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గ్రామ వార్డు సభ మొదలైనప్పటి నుండి జనవరి 6 వరకు ఉంటుందని వార్డు, గ్రామ సభల్లో తమ దరఖాస్తులను అందజేయని వారు జనవరి 6 వరకు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్ విద్యుత్ శాఖ ఏ.ఈ. మల్లయ్య ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు అంగన్వాడి ఆశా కార్యకర్తలు రెవెన్యూ మునిసిపల్ అధికారులు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.