హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఆంక్షలు.. పెద్దగట్టు జాతర నేపథ్యంలో ఈ నెల 9 వరకు..
యదార్థవాది ప్రతినిధి నల్గొండ
సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర సందర్భంగా ఆదివారం నుంచి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల (మూసీ) బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లిస్తారు. రాఘవాపురం స్టేజ్, నామవరం, గుంజలూరు స్టేజ్ వద్ద తిరిగి 65వ జాతీయ రహదారిపైకి వెళ్లేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. భారీ, సరకు రవాణా వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు..విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ, మునగాల, గుంపుల మీదుగా దురాజ్‌పల్లి సమీపంలోని స్వామి నారాయణ ట్రస్ట్ ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వ నుంచి బీబీగూడెం, రోళ్లవాగుతండా మీదుగా టేకుమట్ల బ్రిడ్జి మీదకు మళ్లిస్తారు. భారీ, సరకు రవాణా వాహనాలు కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకోవాలి. అవసరమైతే వ్యక్తిగత వాహనాలు సైతం ఇదే మార్గంలో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని పోలీసులు సూచిస్తున్నారు.