ఔరంగాబాద్ రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరం
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు సోదరులు మృతి చెందిన సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని, ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు.. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు సోదరులు బుధవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృత దేహాలు గురువారం గ్రామానికి చేరుకోగా బాధిత కుటుంబాలను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు. మృత దేహాలకు నివాళులర్పించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన వీరు సూరత్ లో స్థిరపడ్డారు. వారి బంధువు (చిన్నాన్న) చౌటపల్లిలో మృతి చెందగా అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై నలుగురు సోదరులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఏరుకుల కృష్ణ, సంజీవ్, వాసు, సురేష్ కుటుంబాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.. బంధువులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి..