మహిళలకు వైఎస్సార్ కాపునేస్తం
జిల్లాలో 5,905 మంది మహిళలకు రూ.8.85 కోట్ల చెక్కును అందజేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ముత్యాలనాయుడు.
యదార్థవాది విజయనగరం ప్రతినిది
విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా జిల్లాకు చెందిన కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన 5,905 మంది మహిళలు రూ.8.85 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందారు. సంబంధిత చెక్కును జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్. కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో ఎస్.డి. అనిత, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావులు లబ్ధిదారులకు అందజేశారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద వరుసగా నాలుగో ఏట నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నిడదవోలు నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మీట నొక్కటం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం జిల్లా నుంచి లబ్ధిపొందిన మహిళలకు రూ.8,85,75,000 చెక్కును ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం కలెక్టరేట్ వీసీ హాలు నుంచి డీఆర్వో ఎస్.డి. అనిత, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజిరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు, పలువురు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.