అవి ఒట్టి మాటలు.._అవినీతి మూటలు..!_
_అహం బ్రహ్మస్మి.._
_అవినీతి ధన్యోస్మి.._
_నిర్మూలన హతోస్మి..!_
ఈ వేదభూమిలో
నీలో.. నాలో..
పనిలో… ధ్వనిలో..
ఇంట్లో.. ఒంట్లో..
టెంటులో.. పార్లమెంటులో..
కార్యాలయంలో..
దేవాలయంలో..
చివరికి మన దేహాలయంలో
నిండి.. నిభిడీకృతమైన శక్తి
నిన్ను..నన్ను
నడిపించే బలిమి
సర్వాంతర్యామి..అవినీతి..
నిర్మూలిస్తామని చెప్పే
ప్రతివాడు ఆషాఢ భూతి..
ఇంతటి అవినీతి
నభూతో..నభవిష్యతి..!
ఒకనాడైతే
బల్ల కింద చెయ్యి..
సాయంత్రం బార్లో కలుద్దాం…
చెయ్యి తడపడం..
ఫైలు కదలాలంటే
ఇవన్నీ తప్పనిసరి..
అల్లు ముద్దుగా
అడిగితే అమ్యామ్యా..
వీటన్నిటికీ ఒకే పేరు లంచం..
_ఈ దేశాన్ని నడిపించే గుడుగుడు గుంచం.._
ప్రతి అవినీతిపరుడి ఇంటా
వడ్డించిన బంగారు కంచం..!
ఆర్మీలో..జర్నీలో..
క్రికెట్ టోర్నీలో..
అవినీతి లేనిదెక్కడ..
కొందరైతే ఇష్టం
లేకపోయినా బై ఫోర్స్..
_మరీ పెద్ద వారైతే బోఫోర్స్..
సువిశాల భారతావనిని నడిపించేది
ఫోర్ పిల్లర్స్
_అన్నిటా అవినీతి త్రీ చీర్స్..!_
వేళ్ళూనుకుపోయిన ఊడలమర్రి.
కోట్ల కాళ్ళ జెర్రి..
అదే లేకపోతే
ప్రతి పనికీ కొర్రి..
తన పర బేధం లేనిది..
నీ..నా.. మనందరి జీవితాల
నుంచి వేరు చేయడం వీలుకానిది..
రాజైనా..తరాజైనా..
ఉండదు మినహాయింపు..
కొనసాగింపే ముక్తాయింపు..
అవినీతి నిర్మూలన..
_వినడానికే ఇంపు.._
_ప్రపంచమంతా అదే కంపు..!
అవినీతి వ్యతిరేక దినం సందర్భంగా..
సురేష్ కుమార్ ఎలిశెట్టి