టాలీవుడ్ నటుడు చలపతి రావు మృతి..
హైదరాబాద్ 25 డిసంబర్ 22
ప్రముఖ నటుడు చలపతిరావు (78) మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది వరసగా సీనియర్ నటులు మృతి చెందడం బాధగా ఉంది. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల. సత్యనారాయణ, చలపతి రావ్ లు వరసగా మరణించడం చిత్రరంగానికి లోటు. చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. చలపతి రావు ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. 1944 మే8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1966లో విడుదలైన ‘గూఢచారి 116’ సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్ చిత్రాల్లో సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘కలియుగ కృష్ణుడు’, ’కడప రెడ్డమ్మ’, ‘జగన్నాటకం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. సీనియర్ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు. ‘యమగోల’, ‘యుగపురుషుడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’, ‘భలే కృష్ణుడు’, ‘సరదా రాముడు’, ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలి పులి’, ‘చట్టంతో పోరాటం’, ‘దొంగ రాముడు’, ‘అల్లరి అల్లుడు’, ‘అల్లరి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘నువ్వే కావాలి’, ‘సింహాద్రి’, ‘బన్నీ’, ‘బొమ్మరిల్లు’, ‘అరుంధతి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్’ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు….