బంజారాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట.. సేవాలాల్ జయంతి ముగింపు ఉత్సవాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..
యదార్థవాది ప్రతినిది నిజామాబాద్
తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు… బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి ముగింపు ఉత్సవాలను గురువారం అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బంజారా భవన్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 700 తండాలు మాత్రమే గ్రామ పంచాయతీలుగా ఉండేవని, గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీ హోదా కల్పించడంతో రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా 2400 తండాలు జీ.పీలుగా అవతరించాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణాల కోసం ఒక్కో జీ.పీ కి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, రూ. 1276 కోట్ల నిధులను వెచ్చిస్తూ ప్రతి తండాకు ప్రభుత్వం రోడ్డు సదుపాయం కల్పించిందని తెలిపారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతోందని గుర్తుచేశారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కేవలం పాతిక వరకు మాత్రమే ఉండేవని అన్నారు. ప్రభుత్వ సంకల్పంతో ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు లక్ష మంది వరకు గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని, 18 వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని కొనియాడారు. అయన పరమపదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలతో పాటు, నగదు పారితోషికాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రేమలత సురేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఎంపీపీ మహేష్, జెడ్పిటీసి రవి, జెడ్పి కో-ఆప్షన్ మొయిజ్, బాల్కొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సింహాచలం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు, ఆర్మూర్ ఆర్ డీ ఓ శ్రీనివాసులు, బంజారా సేవా సంఘం ప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ తండాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.