టీఎస్‌ఆర్టీసీకి సరికొత్త సాంకేతికత సొబగులు
యదార్థవాది ప్రతినిది హైదరాబాదు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
టీఎస్‌ఆర్టీసీకి సరికొత్త సాంకేతికత సొబగులు
వేగవంతమైన, నాణ్యమైన సేవలకు సాప్ట్వేర్ అప్‌గ్రేడ్
ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్(ఈఆర్పీ) అమలుకు నల్సాప్ట్‌తో టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం
దేశంలోనే అన్ని ఎస్.ఆర్.టి.యులో ఇదే మొదటిది కావడం విశేషం
9 నెలల కాలంలో పూర్తి కానున్నట్లు అంచనా
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రయాణికులకు వేగవంతమైన,నాణ్యమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపట్టింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సాంకేతికతతో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ గారు, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు భావించారు. అందులో భాగంగానే ఒరాకిల్ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్(ఈఆర్పీ) అమలుకు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న నల్సాప్ట్ కంపెనీతో టీఎస్‌ఆర్టీసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. బస్ భవన్‌లో సోమవారం సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, నల్సాఫ్ట్ సీఈవో సీఏ వెంకట నల్లూరి గారు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు. దేశంలోనే అన్ని ఎస్.ఆర్.టి.యులో ఇదే మొదటిది కావడం విశేషం.
“10వేల బస్సులు, 47, 528 వేల మంది ఉద్యోగులు, 99 డిపోలు, 364 బస్ స్టేషన్‌లతో అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉన్నసంస్థ. ప్రతి రోజూ 32 లక్షల కిలోమీటర్లు బస్సులను నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరవేస్తూ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. కార్గో, పెట్రోలు బంకులు, స్వంతంగా జీవా బ్రాండుతో వాటర్ బాటిళ్లు, తదితర విభిన్న సేవలతో ప్రజలకు మరింత చేరువైంది. 9377 గ్రామాలకు రవాణా సేవలు అందిస్తున్న సంస్థలో కార్యకలాపాల నిర్వహణకై ఇ.ఆర్.పిని అమలు చేయడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరచాలని యాజమాన్యం భావించింది. అందుకే ఒరాకిల్ ఈఆర్పీ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని భావించాం. రాష్ట్రంలోని డిపోలు, జోన్లతో పాటు హెడ్ ఆఫీస్‌లోని ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఇంజనీరింగ్, తదితర విభాగాలను ఈఆర్‌పీ ఏకీకృతం చేస్తుంది. నల్సాప్ట్ ఇంప్లిమెంటేషన్ పార్టనర్‌గా ఉంటుంది. సమర్థవంతమైన ఈ వ్యవస్థ టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి దోహదం చేస్తుంది” అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్ పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో టీఎస్‌ఆర్టీసీ ముందంజలో ఉందని, సాంకేతికత ద్వారానే వేగంగా ప్రయాణికులకు చేరువ అవుతున్నామనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓపీఆర్‌ఎస్), బస్ పాసుల జారీ, లాజిస్టిక్, పార్శిల్ సేవలు, బస్సు ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారంగా యూపీఐ చెల్లింపులు, బుకింగ్ కౌంటర్ల ఆన్‌లైన్, ప్రజల సౌకర్యార్థం అద్దె బస్సుల బుకింగ్, ప్రయాణ టికెట్‌తో పాటు తిరుపతి దేవస్థానం శీఘ్ర దర్శన సదుపాయాన్ని ఆన్‌లైన్ ద్వారానే అందిస్తున్నామని చెప్పారు. బస్సుల లోకేషన్‌ను కచ్చితంగా తెలుసుకోవడానికి ‘బస్సు ట్రాకింగ్ యాప్‌ను, సంస్థ రెవెన్యూ నిర్వహణకు కమర్షియల్ యాప్‌ను, ఉద్యోగుల హాజరు, సెలవుల మంజూరు, ఫిర్యాదులను స్వీకరించడానికి ఉద్యోగుల యాప్‌లను ఇటీవలే ప్రారంభించామని తెలిపారు. ప్రాజెక్టు అమలు భాగస్వామిగా నల్సాఫ్ట్ కంపెనీ ఉంటుందని స్పష్టం చేశారు. 20 ఏళ్లకుపైగా నల్సాప్ట్.. ఒరాకిల్ పార్ట్‌నర్‌గా ఉందని, అప్లికేషన్ సొల్యూషన్స్, వేగవంతమైన సేవలను అందించడంలో ఆ కంపెనీకి అనుభవముందన్నారు.
2023 సంవత్సరం టి.ఎస్.ఆర్.టి.సికి ఐటీ సంవత్సరం అని పేర్కొంటూ సంస్థకు ఇది మంచి ఫలితాలనిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇది అన్ని కార్యకలాపాలను ఏకీకృతం చేయడంలో సహాయపడుతుందని, సంస్థకు గొప్ప ప్రారంభం అవుతుందని, ఇది ఐటీ కార్యక్రమాల యుగం అన్నారు. రోజువారీ కార్యకలాపాల్లో సాంకేతికతను ఉపయోగించకుండా ఏ సంస్థ కూడా పురోగమించదన్నారు.
ఈ సందర్భంగా నాల్‌సాఫ్ట్ సీఈవో శ్రీ సీఏ వెంకట నల్లూరి మాట్లాడుతూ ఇది సమిష్టి కృషి అన్నారు. అంకితభావంతో పని చేసి నిర్ధేశించుకున్న కాలానికి పూర్తి చేయగలమనే విశ్వాసం ఉందన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించే టీఎస్‌ఆర్టీసీతో తమ కంపెనీ ఒప్పందం కుదుర్చుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఈ ఒరాకిల్ ఈఆర్పీ ప్రాజెక్టు 9 నెలల్లో పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో ఆపరేషన్లను కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత, స్టోర్‌లు, వర్క్‌షాప్‌లు, సమర్థవంతంగా ఆదాయ నిర్వహణ, తదితర విషయాలపై ఫోకస్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ మునిశేఖర్, శ్రీ వినోద్ కుమార్, చీఫ్ మేనేజర్ (ఎఫ్ అండ్ ఎ) శ్రీమతి విజయ పుష్ఫ, సి.ఒ (ఐటీ) శ్రీ రాజశేఖర్, నల్సాష్ట్ ప్రతినిధులు శ్రీ అనిరుద్ధ్, శ్రీ అఖిల్, శ్రీ వికాస్, శ్రీ హరిప్రసన్న, శ్రీ శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.