దళిత జర్నలిస్టులకు దళిత బంధు అమలులో జాప్యమేలా.!
సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది
రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమ ఆర్థిక స్వాలంబన కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళిత జర్నలిస్టులకు అమలు చేయడంలో జాప్యం ఎందుకని దళిత వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా నాయకులు పల్లెటూరు ప్రసాద్ దుబ్బాక నియోజకవర్గం ఉపాధ్యక్షులు ఇస్తారిగల్ల ఎల్లం అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గం దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత జర్నలిస్టులు అందరికీ దళిత బంధు అమలు చేస్తామని గతంలో జరిగిన దళిత వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా సమావేశాలు, ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ రాష్ట్రస్థాయి సమావేశంలో వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింపచేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి దళిత జర్నలిస్టుకి దళిత పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీశ్ సూచనల మేరకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గ దళిత జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎప్పుడు అడిగిన ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట దటవెస్తున్నరని జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా నాయకులు ఆలోచించి నియోజకవర్గంలో అర్హులైన దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు బాల్ నర్సయ్య, లింగాల మహేశ్, పుట్ట రాజు, గట్టు ప్రసాద్, శ్రీనివాస్, గణేష్, నాగరాజు, నాగేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.