ప్రజలకు మరింత చేరువలో పల్లె వెలుగు..
-ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”
-రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”
-బస్ పాస్ పోస్టర్లను ఆవిష్కరించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్.
హైదరాబాద్ యదార్థవాది
హైదరాబాద్ లోని బస్ భవన్‌లో సోమవారం “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ “జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చిందని, కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయనుందని, టౌన్ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చువచని, ఇందుకు 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను ఖరారు చేసిందని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉందని ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ తెచ్చిందని అన్నారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలని సజ్జనర్ కోరారు. బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.