28.2 C
Hyderabad
Saturday, July 13, 2024
హోమ్తెలంగాణమహాయోధుడు, గోండురాజ్య స్వాప్నికుడు.. కొమరం భీమ్..

మహాయోధుడు, గోండురాజ్య స్వాప్నికుడు.. కొమరం భీమ్..

తమ జీవితకాలంలోనే లెజెండ్‌గా మారిన మహామహులలో కొమరం భీం ఎన్నతగినవాడు. జనగాం (ఆసిఫాబాదు) అవ్వల్ తాలూక్‌దారు (నైజాం కాలంలో కలెక్టర్‌ని అవ్వల్ తాలూక్‌దారు అనేవారు) మౌల్వీ అబ్దుల్ సత్తార్ 1940లో ఆ వీరుడి గురించి తన నివేదికలో అమితంగా పొగిడాడు. భీంలో ఏదో సాధించాలనే గాఢ వాంఛ, తన పంతమే నెగ్గాలనే పట్టుదల ఒకదానితో ఒకటి పడుగుపేకల్లా పెనవేసుకుని ఉన్నాయి. త్వరలోనే ఓ గోండురాజ్యం స్థాపించబడుతుందని, సర్వశక్తిమంతమైన నిజాం ప్రభువు సామ్రాజ్యాన్ని భీం అంతమొందిస్తాడని గోండుల దృఢమైన నమ్మకం’ అని ఆయన పేర్కొన్నారు.తన తెగ అజేయమైనదని భీంకి అంతులేని విశ్వాసం. అందువల్లే అతడు తన అనుచరులతో జిల్లా కేంద్రమైన జనగాంను (ఆసిఫాబాద్) ముట్టడించి, దానిని స్వాధీనం చేసుకుంటాడని నిజాం ప్రభుత్వం భయపడింది. ఈ భయం వల్లే జిల్లాకేంద్రాన్ని ఆసిఫాబాదు నుంచి ఆదిలాబాదుకు మార్చింది. భీం జన్మించిన సంవత్సరం బహుశా 1901 అయిఉండవచ్చు. నైజాం వెలుపలి ప్రాంతాల నుంచి భీం హైదరాబాదు సంస్థానంలోకి వచ్చాడని అబ్దుల్ సత్తార్ అంటాడు. భీం సాధారణ శరీరసౌష్ఠవం, మామూలు ఎత్తు కలిగిన వ్యక్తి. కొద్దిగా ఎత్తు పళ్లు ఉండేవి. పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచేవాడు. నడుస్తూ మాట్లాడేవాడు. అతనిది కంచుకంఠం. గట్టిగా, బిగ్గరగా మాట్లాడేవాడు. గోండులు ధరించే సంప్రదాయ దుస్తులనే ధరించేవాడు. చేతిలో గుత్ప (దుడ్డుకర్ర)పట్టుకుని, చంకలో గొడుగు ఉంచుకునేవాడు. తలపాగా ధరించేవాడు. అప్పుడప్పుడు రూమీ టోపీ పెట్టుకునేవాడు. భీం చదువుకున్నాడు. తెలుగు, ఉర్దూ రెండు భాషలు రాయడం, చదవడం వచ్చు. వృత్తిరీత్యా రైతు. ఇతర రైతుల మాదిరిగా భూమినే నమ్ముకుని పగలు, రాత్రి శ్రమించేవాడు. పిల్లలను ముద్దు చేసేవాడు. వాళ్ల చదువుల కోసం ఒక పంతులును కూడా నియమించాడు. అతడికి దైవభక్తి ఎక్కువే. గోండు దేవతలను నిత్యం ఆరాధించేవాడు. ముస్లింల పట్ల ద్వేషం, వైరం ఎన్నడూ ప్రదర్శించేవాడు కాదు. అణిచివేతకు లొంగే తత్వం భీంలో ఏ కోశానా లేదు. అందుకే అటవీ అధికారులు బాబాజరీలో గోండుల గుడిసెలకి నిప్పుపెట్టి, వారి పొలాలు ధ్వంసం చేసినప్పుడు భీం ఎదురు తిరిగాడు. భీం దూకుడికి అటవీ అధికారులు తోక ముడవక తప్పలేదు. ఇది తెలిసిన అమీన్ (సబ్ ఇన్‌స్పెక్టర్) జాఫర్ అహ్మద్ కొంతమంది పోలీసులను వెంటబెట్టుకొని, అతడిని నిర్బంధంలోకి తీసుకోవడానికి వెళ్ళాడు. తన యత్నంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. భీంకి, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో మహమ్మద్ జాఫర్ తుపాకీ కూడా వదిలేసి బతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించాడు. భీం మూఢనమ్మకాలను విశ్వసిస్తాడని ప్రచారం జరిగింది. అతడు నాస్తికుడు కాదు. తమ దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజించేవాడు. తన తెగకి చెందిన అన్నిరకాల కర్మ కాండల్లోనూ పాల్గొనేవాడు. అయితే అతనికి మూఢనమ్మకాలు లేవు. యుద్ధానికి ముందు రోజు వందలమంది గోండులు గుమిగూడిన సభలో అతను ప్రసంగించాడు. పోరుకు ముందుకు దూకలేని పిరికివాళ్లు. ప్రాణభయం ఉన్నవాళ్లు వెనక్కి తిరిగి వెళ్లిపోవచ్చని అందరి ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. భీం మూఢనమ్మకాలకు బానిస అయితే, తన విజయం పట్ల అతడికి ఏమాత్రం అపనమ్మకం ఉండేది కాదు. అలాగే భీం దగ్గర కొన్ని అతీంద్రియ శక్తులు, మంత్రశక్తులు ఉన్నాయని కూడా అతడి గురించి కొమరం సూరు చెప్పిన కథల్లో ఉంది. భీం దగ్గర ఆ శక్తులు ఉన్నాయని అతడి అనుచరులూ నమ్మలేదు. వాళ్లుగనక నమ్మి ఉంటే, పోరుకు ముందు రోజు భీం ప్రసంగం తరువాత, కొంతమంది గోండులు జోడెన్‌ఘాట్ నుంచి వెనుతిరిగి పోయేవారు కాదు. యుద్ధానికి ముందుకు కదులుతున్నప్పుడు, గోండులు తమని ఏదో మానవాతీత శక్తి ఆవహించి, కదుపుతున్నట్లు కదులుతారు. అది ఒక రకమైన trance like motion దానివల్లే భీంకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని పుకార్లు వచ్చాయి. వీటిని అజ్ఞానులైన తమ పోలీసు కానిస్టేబుల్స్ నమ్మారని అబ్దుల్ సత్తార్ కూడా అన్నాడు. భీం చుట్టూ ఉందని భావించే ఒక మాయాచక్రం, అతడిలో ఉన్నాయనుకున్న మానవాతీత కదలికలు, తుపాకిగుళ్లు శరీరానికి తగిలి గాలిబుడగల్లా పేలిపోవడానికి అతడు ఒంటి నిండా రాసుకున్న ఆకుపసరు.. ఇవేవీ వాస్తవం కావు. అవన్నీ కాకమ్మ కథలే. కొమరం భీం పైకి యుద్ధానికి వచ్చిన పోలీసు పటాలం వెంట సివిల్ సర్జన్ డాక్టర్ నాయుడు కూడా వచ్చాడు. ఆయన యుద్ధంలో చనిపోయిన గోండుల మృతదేహాలకు శవపరీక్ష చేశాడు. ఆ దేహాల మీద ఉన్న గాయలనన్నింటినీ ఆచప విపులంగా వివరించాడు. అవి అన్నీ తుపాకీగుళ్ల గాయాలేనని తన నివేదికలో పేర్కొన్నాడు. అంతేకాదు భీంతో పాటు ఏ గోండు శరీరం మీద ఎలాంటి ఆకుపసరు జాడ కానీ, అలాంటి పసరు పూసుకున్నందు వల్ల ఏర్పడ్డ రంగుగానీ ఎక్కడా లేవని తన అధికారిక నివేదికలో పేర్కొన్నాడు. భీం పుట్టుకతోనే యోధుడు. అతడు రాజగోండు. బాబాజరిలో భీం తన శత్రువుపై మెరుపు దాడి చేశాడు. ఇటువంటి గెరిల్లా తరహా దాడులు కేవలం కాకలు తీరిన యుద్ధవీరులే చేస్తారు. ఒక వీరుడు శత్రుసైన్యాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడు. భీం కూడా అంతే. అందుకే ఇతర బలవంతులైన గోండుల సహాయ సహకారాల కోసం అతడు తన దూతలను వారి దగ్గరకు పంపిస్తాడు. భీం దూతలైన జాకో, కూమరలింగ, పంగడి రాజు దగ్గరకు వెళ్లి అతడి చేరవేశారు. ప్రాణాలకు తెగించి దాదాపు ఐదువందల మంది గోండులు చేతికి అందిన ఆయుధాలను తీసుకుని జోడెన్‌ఘాట్‌కి రావడానికి కారణం భీం వాస్తవిక యుద్ధనీతి, అతడిలోని యోధుని లక్షణాలు, గోండురాజ్యం స్థాపించాలనే అతడి ఆశయం తప్ప మరోటి కాదు. భీం మీద దాడి చేయడానికి అవ్వల్ తాలూక్‌దారు అబ్దుల్ సత్తార్, దువ్వం తాలూక్‌దారు ఆగా మహమ్మద్ అలీ, డీఎస్పీ హిదాయతుల్లా సాహెబ్ అరబ్బులు, చావుషులు, సింధీలు ఇంకా రెవిన్యూ అధికారులను వెంటబెట్టుకుని జోడెన్‌ఘాట్‌కి సమీపంలో ఉన్న వాధంలో శిబిరాలు వేసుకున్నారు. సివిల్ సర్జన్ డాక్టరు నాయుడితో పాటు 30 మంది వైద్యసిబ్బంది కూడా వారితో ఉన్నారు. వీళ్లుగాక, ఆనాటి ఆధునిక ఆయుధాలు సమృద్ధిగా కలిగి ఉన్న ప్రత్యేక శిక్షణ పొందిన 94 మంది కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఇంత సైన్యం, ఇంతమంది అధికారులు భీంపై ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయారు. గోండు శ్రేణులలో ఏమాత్రం అలజడిని, భయాందోళనలను కలిగించలేకపోయారు. అందుకే గోండు వీరులు మోగించిన యుద్ధభేరీల సంగీతం జోడెన్‌ఘాట్‌ కొండలలో గుండెలు పగిలేలా ప్రతిధ్వనించింది. భయంకరమైన యుద్ధం చెలరేగింది. భీం చేసిన పెనుదాడికి తన శ్రేణులలో ముందు వరుసలో ఉన్నవారు తిరోగమించి మరోచోట పొజిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందని అబ్దుల్ సత్తార్ తన నివేదికలో పేర్కొన్నాడు. అతి బలవంతుడైన అబ్దుల్ సత్తార్‌కి ఆ యుద్ధం అన్ని వేళలా అనుకూలంగా లేదు. తనతో మరింత సైన్యాన్ని వెంటబెట్టుకుని రానందుకు అతడు తనని తాను నిందించుకున్నాడు. జోడెన్‌ఘాట్‌ పోరాటం చాటుమాటు పోరాటం కాదు. ఆ భీకర యుద్ధంలో భీం, అతడి మేనల్లుడు రఘు పోలీసులకు ఎదురుగా 10 గజాల దూరంలోనే వీరమరణం పొందారు. భీం నేలకొరిగిన తరువాతే మిగిలిన గోండులు యుద్ధరంగం నుంచి తప్పుకున్నారు. పై వాస్తవాలన్నీ అతడిని ఒక మహాయోధుడిగా మన ముందు నిలబెడతాయి. అతడు నూటికి నూరు పాళ్లూ సమరయోధుడే. పొడవైన మొగలు కత్తి దూసి ముందుకు వస్తున్న భీం అజేయంగా కనిపించాడు అంటాడు అబ్దుల్ సత్తార్. భీంను ఒక మహాయోధునిగా నిర్ధారించడానికి ఇంతకు మించిన ధ్రువీకరణ పత్రం, ప్రశంసాపత్రం మరేదీ అవసరం లేదు. జోడెన్‌ఘాట్‌లో యుద్ధం జరిగిన రోజు గానీ లేక ఆ మరుసటి రోజు గానీ భీం వీరమరణం పొందాడు. ఆయన 1940 అక్టోబర్ 8న చనిపోయాడని ఓ అభిప్రాయం ఉంది. జోడెన్‌ఘాట్‌లో జరిగిన యుద్ధం గురించిన వివరాలు 1940 అక్టోబర్ 5న ముషీర్-ఎ-డెక్కన్‌లో వచ్చాయని, హోమ్ సెక్రెటరీ మహమ్మద్ అజర్ హసన్‌కి 1940 అక్టోబర్ 7న రాసిన లేఖలో అబ్దుల్ సత్తార్ పేర్కొన్నాడు. 1940 అక్టోబర్ 6న కాశీనాథరావు వైద్య, సిరాజుల్ తిర్మియాజీ, నరసింగరావు, రామాచారి వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఆసిఫాబాదు వచ్చారు. అదేరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, హిందూ ప్రజామండలికి చెందిన వారు కూడా వచ్చారని అబ్దుల్ సత్తార్ పేర్కొన్నాడు. కాబట్టి కొమరం భీం 1940 అక్టోబర్ 5వ తేదీకి ముందే అమరుడయ్యాడనేది వాస్తవం….

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్