విశ్వవ్యాప్తమైన మన పూల సంబురం…బూర్జ్ ఖలీఫా నెత్తిన బంగారు ‘బతుకమ్మ’

298

ఖండాంతరాలు దాటిన సాంస్కృతిక వైభవం

పూల పండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం

దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై ‘బతుకమ్మ’

బతుకమ్మ ప్రస్థానంలో మరో అరుదైన ఘట్టం

ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనం

మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ దృశ్య నివేదనం

తెలంగాణ పూలపండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం

దుబాయ్ –

తెలంగాణకే తలమానికమైన పూల పండుగ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించారు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ రోజు సాయంత్రం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. బతుకమ్మ వీడియోను బూర్జ్ ఖలీఫా తెరపై రెండు సార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివి గల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు ముఖ్యమంత్రి ‌కేసీఆర్ గారి చిత్రపటాన్ని సైతం బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై ప్రదర్శించారు.

రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బూర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన ప్రవాస తెలంగాణ వాసులు పులకించిపోయారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది బతుకమ్మ పండుగ వీడియోలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం మన రాష్ట్రానికే గాక, దేశానికి సైతం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం చరిత్రలో నిలిచిపోతుందన్న ఎమ్మెల్సీ కవిత, ఇందుకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బూర్జ్ ఖలీపా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గత పుష్కర కాలంగా బతుకమ్మ పండుగను ప్రతీ ఏటా పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ జాగృతిని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత, బతుకమ్మ పండుగ ద్వారా ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యులను చేశారు. పువ్వులను పూజించే విశిష్ట సంప్రదాయాన్ని ప్రతీ ఏటా ఊరూ వాడా ఘనంగా జరుపుకునేందుకు ఎమ్మెల్సీ కవిత గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకమ్మ పండుగను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో సైతం తెలంగాణ ఆడబిడ్డలంతా గొప్పగా జరుపుకుంటున్నారు.

ఇక ఈ ఏడాది బతుకమ్మ పండుగ మరింత ప్రత్యేకం. బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు నడుంబిగించినట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత, అందులో భాగంగా ప్రతీ ఏటా సరికొత్త విధంగా బతుకమ్మ పండుగ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించారు. ఇవ్వాల దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ద్వారా, తెలంగాణ పూల పండుగ మరోసారి మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జీవన్ రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజయ్, బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, దాస్యం విజయ్ భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి