వ్యవసాయ కళాశాల ప్రారంభానికి సిద్దం..
*12న నూతన వ్యవసాయ కళాశాల
ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రులు
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల ప్రారంభానికి సిద్ధమైంది. 35 ఎకరాల విస్తీర్ణంలో 69.30 కోట్లతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటుచేసింది. 16 ఎకరాల్లో జీ ప్లస్ 2 పద్ధతిలో కళాశాల భవనం విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఫాంలాండ్స్‌ను నిర్మించింది. అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రయోగశాల సెమినార్ ఆధునిక లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఈ నెల 12 వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి మంత్రి కే తారక రామారావు కళాశాల భవనం హాస్టల్స్ ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ రఘునందన్ రావు రిజిస్ట్రార్ డాక్టర్ సుదీర్ బాబు వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ సీమ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.