విపక్షాలు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది
యదార్థవాది ప్రతినిధి న్యుడిల్లి
ప్రభుత్వంపై విపక్షాలు ఎంతగా బురదచల్లినా ‘కమలం’ మరింతగా వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదానీ వ్యవహారంపై రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అడ్డు తగలడంపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు ఎంపీల భాష, ప్రవర్తిస్తున్న తీరు, చేస్తోన్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని.. గత కాంగ్రెస్ పాలనను ఎండగడుతూనే విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ”విపక్షాల తీరు చూస్తుంటే బాధేస్తోంది. ఇలాంటి ముఖ్యమైన సభలో నినాదాలు చేయడం దురదృష్టకరం. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన వారికి లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన కీలక సభలో ఇలా ప్రవర్తిస్తారా? మీరు విసిరే బురదలో కూడా ‘కమలం’ (భాజపా ఎన్నికల గుర్తు) వికసిస్తుంది. యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకూ పరిష్కారం చూపలేదు. దేశ ప్రగతిని నాశనం చేసింది. చిన్న చిన్న దేశాలు పురోగమిస్తున్న సమయంలో ఆరు దశాబ్దాల కాలాన్ని మన దేశం కోల్పోయింది. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. ఎంత అడ్డుకున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మేం ఏమాత్రం వెనకడుగు వేయం. మా విధానాలతో దేశంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నాం” అని ప్రధాని అన్నారు..