సమయపాలన పాటిద్దాం.. ప్రజల నుండి వినతుల స్వీకరిద్దాం
-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు సమయపాలనకు ప్రాధాన్యత నివ్వాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణిలో సంబంధిత డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు సంబంధిత ఇతర శాఖల అధికారులతో కలిసి వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన ప్రజల నుండి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని అధికారులందరూ ప్రజావాణి రోజున 10-15 నిమిషాలకల్లా హాజరు కావాలని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు-06, ధరణి- 23, పింఛన్లు-02, ఇతర సమస్యలు-22 మొత్తం 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును మీ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, మీ పరిధి కాని సమస్యలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలన్నారు.