24.7 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 123

ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

యదార్థవాది 22 జనవరి అమరావతి:

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్‌ పరిస్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా 5వ తేదీ నాటికి 90-95% ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ప్రభుత్వం చెల్లిస్తోంది.మిగిలిన 5% మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వగలం’ అని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటనవిడుదలచేశారు.ఉద్యోగుల జీతాలు, పింఛను బిల్లులు 90-95% వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్‌ చేస్తారని, వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల 5లోగా పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు. రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు (వేస్‌ అండ్‌ మీన్స్‌- చేబదుళ్లు) అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని వివరించారు. ఇంతకుముందు, ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగుతోందని తెలిపారు.

ఇంద్ర కరణ్ రెడ్డి తో..కొప్పుల సమావేశం..

ఇంద్ర కరణ్ రెడ్డి తో..కొప్పుల సమావేశం…

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

అరణ్య భవన్ లో రాష్ట్ర దేవాదయ శాఖా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాకు సంబందించి దేవాదయ శాఖ అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

మంత్రి వెంట కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్ ఉన్నారు.

ప్రశాంతంగా ముగిసిన సింగరాయ జాతర..

ప్రశాంతంగా ముగిసిన సింగరాయ జాతర..

కోహెడ: యదార్థవాది

కోహెడ మండలం లోని కూరెళ్ళ, తంగళ్ళపల్లి, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్ గ్రామాల మధ్యలో గల శ్రీ ప్రతాప రుద్ర సింగరాయ జాతర ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర జరిగిందని కోహెడ తహసిల్దార్ జావిద్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.కూరెల్ల మరియు తంగళ్ళపల్లి గ్రామాల సరిహద్దుల్లో సింగరాయ జాతర జరుగుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా సరిహద్దుల వివాదం తలెత్తినందున ఈ సంవత్సరం రెవెన్యూశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో జాతరను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ముగియడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు…

సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ ఆదరించిన ప్రజలు

సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ ఆదరించిన ప్రజలు

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

సంక్రాంతి 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణలు చేశారు..

సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ రూ.165.46 కోట్ల రాబడి..

టీఎస్‌ఆర్టీసీని అక్కున చేర్చుకున్న ప్రయాణికులు..ధన్యవాదాలు తెలిపిన సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి,ఎండీ వీసీ సజ్జనర్‌..

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ.62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్‌) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది. “టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు. సాధారణ చార్జీలతోనే 3923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతేకాదు, రద్దీకి అనుగుణంగా మా సిబ్బంది అద్బుతంగా పనిచేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు అన్నారు. సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలానే ఆదరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్దతతో పనిచేశారని, వారి కృషి వల్లే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్‌, ఉప్పల్‌, ఆరాంఘర్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్‌ బయోటాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్‌ఆర్టీసీ కుటుంబంలోని ప్రతి ఒక్క సిబ్బందికి సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, ఎండీ వీసీ సజ్జనర్‌ ఐపీఎస్‌ గారు ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలని అందించాలని ఆకాంక్షించారు.సంక్రాంతి సందర్భంగా తమ సంస్థకు రవాణా, పోలీస్‌, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు సహకరించారని గుర్తుచేశారు. ఆయా విభాగాల సమన్వయంతో పనిచేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. టీఎస్‌ఆర్టీసీకి సహకరించిన రవాణా, పోలీస్‌, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

భూనిర్వాహసిత యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలి…

భూనిర్వాహసిత యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలి…

హుస్నాబాద్: యదార్థవాది ప్రతినిది

భూనిర్వాహసిత యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని మాజీ పోలీస్ అధికారి దాసరి భూమయ్య అన్నారు.. అక్కన్నపేట మండలం గౌరెల్లి ప్రాజెక్ట్ గుడాటిపల్లి భూనిర్వాసిత యువత 60రోజుల నుండి దీక్ష చేస్తున్న యువతకు సంఘీభావంగా దాసరి భూమయ్య ఒకరోజు దీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరెల్లి రిజర్వాయర్ భూసేకరణ కోసం 10,15 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి, అప్పటి నుండి ఇప్పటివరకు పెండ్లిలకు వచ్చిన యువతులు ప్రభుత్వం జాప్యంతో పెండ్లిలు చేసుకోకుండా ఇంట్లోనే ఉండాలా అని ప్రశ్నించారు.. దీనికి కారణం ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎస్సి, ఎస్టి బడుగు బలహీన వర్గాల, యువతి, యువకులకు అండగా నిలవాలని కోరారు. ధర్నా చేస్తున్న భూనిర్వాసిత యువతి యువకులను చంపుతామని బెదిరిస్తున్నారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని కోరారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవ తీసుకొనీ భూములు కోల్పోయిన రైతులను, వారి పిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించాలని భూమయ్య కోరారు..

జమ్ములో జంట పేలుళ్లు…

జమ్ములో జంట పేలుళ్లు…

జోడో యాత్ర నేపథ్యంలో హై అలర్ట్‌

శ్రీనగర్‌: యదార్థవాది ప్రతినిది

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న తరుణంలో.. జమ్ములో జంట పేలుళ్లు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.నర్వాల్‌ పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అప్రమత్తమైన బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముఖ్యంగా రాహుల్‌గాంధీ జోడో యాత్ర కొనసాగే మార్గాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే, బాంబు పేలుళ్లకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియ రాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫొరెన్సిక్‌ నిపుణులు, క్లూస్‌ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి.పేలుళ్లు చోటు చేసుకున్నట్లు ధ్రువీకరించిన జమ్ము అదనపు డీజీపీ ముకేశ్‌ సింగ్‌.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర జమ్ముకు 60 కిలోమీటర్ల దూరంలో చద్వాల్‌ వద్ద కొనసాగుతోంది. శీతాకాల విరామం అనంతరం శుక్రవారం యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ ఇవాళ బ్రేక్‌ ఇచ్చారు. తిరిగి రేపు ప్రారంభించనున్నారు. జనవరి 30 నాటికి యాత్ర పూర్తి చేయాలని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. భద్రతా పరమైన కారణాల రీత్యా ఏ మార్గంలో యాత్ర నిర్వహించాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు అధికారులకే వదిలేశాయి. దీని కోసం రెండు మూడు రూట్లను ఎంపిక చేసి అధికారులకు ఇచ్చారు.

కమ్యూనిస్టు యోధుడు లెనిన్ కు నివాళి.

కమ్యూనిస్టు యోధుడు లెనిన్ కు నివాళి.

హుస్నాబాద్: యదార్థవాది ప్రతినిది

లెనిన్ బాటలొ నేటి యువత పయనించాలి.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ పిలుపు.

కమ్యూనిస్టు యోధుడు, సోవియట్ యూనియన్ వ్యవస్థాపక అధినేత అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు విప్లవ స్ఫూర్తి ప్రధాత వ్లాదిమిర్ లెనిన్ 99వ వర్థంతి సందర్భంగా శనివారం హుస్నాబాద్ పట్టణంలో అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో లెనిన్ చిత్రానికి పులమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గడిపె మల్లేశ్ మాట్లాడుతూ లెనిన్ ఆశాయాల బాటలో నేటి యువత పయనించి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను అరికట్టేందుకు లెనిన్ బాటలో పయనించాలని గడిపె మల్లేశ్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, సిపిఐ సినియర్ నాయకులు అయిలేని మల్లారెడ్డి, ఎండి అక్బర్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పట్టణ అధ్యక్షులు ఏలురి స్వాతి, ఎఐవైఎఫ్ నాయకులు ఏలురి సాయి ప్రసాద్ రెడ్డి, రాయికుంట శంకర్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
కీలక సూచనలివే…!
— 997 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పోలీస్‌ నియామక మండలి..
అభ్యర్థులకు తగిన సూచనలతో నోట్‌ విడుదల
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు!

అమరావతి: యదార్థవాది ప్రతినిది

పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ప్రిలిమినరీ పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించరనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు మొత్తం 5.03 లక్షలమంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. అవి.. అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షకేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి. అభ్యర్థులను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. మొబైల్‌ ఫోన్‌/సెల్యూలార్‌ ఫోన్, ట్యాబ్‌/ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌ పరికరాలు/రికార్డింగ్‌ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్‌ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. వాటిని పరీక్షకేంద్రం వద్దకు తీసుకురాకూడదు. వాటిని భద్రపరిచేందుకు పరీక్షకేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. అభ్యర్థులు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్‌ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలి. హాల్‌టికెట్, బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ తీసుకురావాలి.

రష్యాటు గోవా విమానానికి బాంబు బెదిరింపు…

రష్యాటు గోవా విమానానికి బాంబు బెదిరింపు…

పనాజీ: యదార్థవాది ప్రతినిది

రష్యాలోని పర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి గోవాకు బయలుదేరి విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్‌కు డైవర్ట్ చేశారు.ఆ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ఇద్దరు శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం సిబ్బంది ఏడు మంది ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఆ చార్టెడ్ ఫ్లయిట్ గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో తెల్లవారుజామున 4.15 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ భారతీయ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించకముందే దాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారి మళ్లించారు.విమానంలో బాంబు ఉన్నట్లు రాత్రి 12.30 నిమిషాలకు గోవా ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల క్రితం మాస్కో నుంచి గోవాకు వస్తున్న ఓ విమానాన్ని అత్యవసరంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపు రావడం వల్లే ఆ విమానాన్ని దించారు.

మోదీ సర్కారు ఆ ఐదు నిర్ణయాలపై ఆసక్తి..!

మోదీ సర్కారు ఆ ఐదు నిర్ణయాలపై ఆసక్తి..!

న్యూఢిల్లీ: యదార్థవాది ప్రతినిది

ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది. భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. దీని ప్రభావం కొంతైనా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతను మొదలుపెట్టాయి. దీంతో ప్రజల వ్యయశక్తి తగ్గి ప్రభుత్వ ఆదాయం తగ్గనుంది. ఈ క్రమంలో ఎక్కడ అభివృద్ధికి బ్రేకులు పడకుండా ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం మోదీ సర్కారుకు కత్తిమీద సాములా మారనుంది. ప్రభుత్వం వ్యయ నియంత్రణ ఎక్కడ బ్యాలెన్స్‌ తప్పినా ద్రవ్యలోటు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మార్కెట్‌ నుంచి కేంద్రం నిధులు సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇది వడ్డీరేట్లపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపుతప్పే ప్రమాదముంది.

తక్కువ ద్రవ్యలోటు.. గోల్డ్‌మన్‌ శాక్స్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం 2023 ఏప్రిల్‌ 1 నుంచి కేంద్రం ద్రవ్యలోటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించవచ్చు. భారత్‌ దీనిని తన జీడీపీలో 5.9గా నిర్ధారించే అవకాశలున్నాయి. అభివృద్ధి పనులను ఆపకుండానే ఈ సారి సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామీణ పథకాలు, హౌసింగ్‌ పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ నిపుణులు అండ్రూ టిల్టన్‌, శాంతను సేన్‌ గుప్తా అభిప్రాయపడ్డారు.

పన్ను శ్లాబుల్లో మార్పులు.. బడ్జెట్‌ (Budget 2023) అనగానే మధ్య తరగతి జీవి ఆశగా ఎదురు చూసేవి పన్ను శ్లాబుల్లో మార్పులు. ప్రస్తుతం రూ.2.5లక్షల ఆదాయంపై పన్ను లేదు. 2014-15లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనలో ఇప్పటి వరకూ మార్పు లేదు. చిరు ఉద్యోగులకు పెరుగుతున్న ఖర్చులకు (ద్రవ్యోల్బణానికి) సరిపడా మాత్రమే జీతాలు పెరిగినా ఆ మేరకు పన్ను పోటు కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇంధన, ఆహారధరల్లో వృద్ధితో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో పన్ను లేని ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతుందనే అంచనాలున్నాయి.

స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు.. ఆదాయపు పన్ను లెక్కింపులో కీలకమైన స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిధిపై కూడా చాలా రోజులగా అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం ఇది రూ.50,000గా ఉంది. దీనిని కనీసం రూ.లక్షకు పెంచాలన్న డిమాండ్లు బలంగా ఉన్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకొని దీనిలో ప్రభుత్వం కొంత వెసులుబాటు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

గృహ రుణ వడ్డీ చెల్లింపులపై మినహాయింపు పెంపు.. గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఇప్పటి వరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24(బీ) ప్రకారం మినహాయింపు లభిస్తుంది. దీనికి అత్యధికంగా రూ.2,00,000 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. కొవిడ్‌ తర్వాత మళ్లీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పుంజుకొంది. ఇళ్ల రేట్ల ధరలు ఏటా కనీసం 3.5శాతం చొప్పున పెరిగాయి. మరో పక్క వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. కొవిడ్‌ సమయంలో 6.5 వద్ద ఉన్న వడ్డీ రేటు 8.5 దాటేసింది. దీంతో వినియోగదారులపై చెల్లింపుల భారం కూడా పెరిగింది. ఈ సమయంలో సెక్షన్‌ 24(బీ) పరిధిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది.

మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు నిధులు పెంపు.. 2024 పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టే బృహత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు ఈ బడ్జెట్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. 2024లో కేవలం తాత్కాలిక బడ్జెట్‌ కావడంతో అప్పుడు ప్రభుత్వానికి పెద్దగా అవకాశాలు ఉండవు. దీనిని దృష్టిలో ఉంచుకొనే నయా ప్రాజెక్టుల ప్రకటనలు ఉండొచ్చు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...